విద్యుత్ రంగంలో సేవల విస్తరణ... అభివృద్ధి పనులపై ఎంపీ సమీక్ష
*ఎంపీ శ్రీభరత్ అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం
*భాగస్వామ్యమైన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు
విశాఖపట్నం (ఉత్తరప్రభ) :
జిల్లాలో విద్యుత్ రంగ అభివృద్ధి పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై విశాఖపట్టణం ఎంపీ శ్రీభరత్ సుదీర్ఘంగా సమీక్షించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఆయన అధ్యక్షతన జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా ముందుగా జిల్లాలో అమలు చేస్తున్న పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమగ్ర వివరణ ఇచ్చారు. జిల్లాలోని నాలుగు జోన్ల పరిధిలో 11 మండలాల ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు.
ఎంపీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పీఎం సూర్యఘర్: మఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకం ప్రయోజనాలను పొందేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సబ్సిడీలు, ప్రయోజనాల వివరాలను స్పష్టంగా వివరించి ప్రజల్లో విశ్వాసం పెంచాలన్నారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ఉద్దేశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వ్యవస్థలను ప్రోత్సహించాలని సూచించారు. పీఎం కుసుమ్ కింద జిల్లాలో చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు దీర్ఘకాల ప్రయోజనం చేకూరేలా పథక అమలు ఉండాలని హితవు పలికారు.
జిల్లాలో కొనసాగుతున్న భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు, ఈహెచ్టీ సబ్ స్టేషన్లు, 33/11 కేవీ సబ్ స్టేషన్లు, ఇంటర్ లింకింగ్ అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ సమీక్షించారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు పీటీఆర్లు, కొత్తగా ప్రతిపాదించిన సబ్ స్టేషన్లు, ఫీడర్ స్టేషన్ల తాజా స్థితిపై కూడా ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌డీఎస్‌ఎస్ (Revamped Distribution Sector Scheme) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, విద్యుత్ నష్టం తగ్గింపు, స్మార్ట్ మీటరింగ్, మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చివరిగా జిల్లాలోని విద్యుత్ రంగ సేవలను, సబ్ స్టేషన్ల వివరాలను, గణంకాలను వివరిస్తూ నివేదికలు ఇవ్వాలని, ప్రత్యేక మ్యాప్ లు రూపొందించాలని ఆదేశించారు.
సమావేశంలో డిస్క్ం ఎస్.ఈ. శ్యాంబాబుతో పాటు, ట్రాన్స్ కో ఎస్.ఈ. శివరామ కృష్ణ, ఈఈలు ధర్మరాజు, శ్రీనివాసరావు, వీకే నాయుడు, సింహాచలం నాయుడు, డీఈఈ సుమన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.